How to Claim LIC Policy Amount
LIC Policy: ఎల్‌ఐసీ పాలసీ చేసి మర్చిపోయారా? ఇదిగో ఇలా క్లైయిమ్ చేసుకోవచ్చు..
LIC Policy: ఎల్ఐసీ పాలసీ తీసుకొని.. వాటికి నగదు చెల్లించారు. కానీవాటిని క్లెమయ్ చేసుకోవడం చాలా మంది మరిచి పోయారు. దీంతో వేలాది కోట్లు.. అలా ఉండిపోయాయి. ఇదే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి సైతం చాలా క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.
ఇన్సూరెన్స్ గడువు ముగిసినప్పటికీ పాలసీదారుకి మెచ్యూరిటీ అమౌంట్ చేతికి అందట్లేదట. ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన ఎల్ఐసీ వద్దనే పాలసీదారుల మెచ్యూరిటీ అమౌంట్ కోట్లలో బకాయిలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో ఎల్ఐసీ పాలసీ ఒక భాగమైపోయింది. అయితే 2014 నుంచి ప్రారంభించిన పాలసీలపై కేంద్రం జీఎస్టీ వేస్తోంది. దీంతో పలువురు వీటికి దూరంగా జరిగారు. మరికొందరు మాత్రం భవిష్యత్తులో పని చేస్తుందంటూ ఎల్ఐసీ పాలసీలు చేస్తున్నారు. అంతేకాకుండా.. తక్కువ ప్రీమియంతో అధిక లాభాలు అందించే స్కీమ్‌లను సైతం రూపొందిస్తున్నాయి. అయితే ఇన్సూరెన్స్ గడువు ముగిసినప్పటికీ పాలసీదారుడికి మెచ్యూరిటీ అమౌంట్ చేతికి అందట్లేదని ఓ ప్రచారం అయితే సాగుతోంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ వద్దనే పాలసీదారుల మెచ్యూరిటీ అమౌంట్ కోట్లలో బకాయిలు ఉన్నాయి. ఎల్ఐసీ వద్ద అన్‌క్లెయిమ్డ్(Unclaimed) మెచ్యురిటీ అమౌంట్ రూ.880.93 కోట్లు ఉందంటూ పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు.
గతేడాదికి ముందు అంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 3,72,282 పాలసీదారుల మెచ్యురిటీ అమౌంట్ అన్‌క్లెయిమ్డ్‌గా మిగిలిపోయిందని గణాంకాలతో సహా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సోదాహరణగా వివరించారు.*
10 ఏళ్ల వరకు అన్‌క్లెయిమ్డ్ అమౌంట్‌గా మిగిలిపోతే..
అయితే అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ అంటే ఏమిటనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. దీనిపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) వివరణ ఇచ్చింది. అదేమంటే.. పాలసీదారుల ఇన్సూరెన్స్ గడువు పూర్తయిన అనంతరం డ్యూ డేట్ లేదా సెటిల్‌మెంట్ తేదీ నుంచి ఆరు నెలల్లోపు మెచ్యురిటీ అమౌంట్‌ని పాలసీ హోల్డర్లు లేదా బెనిఫిషియరీలకు ఇన్సూరెన్స్ కంపెనీలు అందించాల్సి ఉంది. అలా ఆరు ఏళ్లలోపు మెచ్యురిటీ అమౌంట్‌ని ఇవ్వకపోతే వాటిని అన్‌క్లెయిమ్డ్ అమౌంట్స్‌గా పరిగణిస్తారు. ఇలా 10 ఏళ్ల వరకు అన్‌క్లెయిమ్డ్ అమౌంట్‌గా మిగిలిపోతే.. అనంతరం నియమ నిబంధనల ప్రకారం.. ఆ మొత్తన్ని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌కి బదిలీ చేస్తారు.
వీటిని ఎలా చెక్ చేసుకోవాలంటే..?
అన్‌క్లెయిమ్డ్ జాబితాలో మీ ఎల్‌ఐసీ పాలసీ ఉందో లేదో పాలసీదారులు ముందుగా చెక్ చేసుకోవచ్చు. అందుకోసం కొన్ని రకాల డీటైల్స్ కావాల్సి ఉంటుంది. ఎల్ఐసీ పాలసీ నంబర్, పాలసీదారుడి పేరు, జన్మించిన తేదీ, పాన్ కార్డ్ తదితర వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇక అన్‌క్లెయిమ్డ్ జాబితాను చెక్ చేయడానికి ముందుగా.. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ https://licindia.in/home లోకి వెళ్లాలి. అందులో ‘కస్టమర్ సర్వీస్’పై క్లిక్ చేసి ‘అన్‌క్లెయిమ్డ్ అమౌంట్స్ ఆఫ్ పాలసీ హోల్డర్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. అనంతరం పాలసీ నంబర్, పేరు (తప్పనిసరి), పుట్టిన తేదీ (తప్పనిసరి), పాన్ కార్డ్ వివరాలు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే పూర్తి వివరాలు వచ్చేస్తాయి. ఒకవేళ మీ పాలసీ అమౌంట్ ఈ జాబితాలో ఉంటే సదరు అధికారిని సంప్రదించి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి కారణాలు..
మరోవైపు ఇలా అన్‌క్లెయిమ్డ్ అమౌంట్స్ భారీగా పెరిగిపోవడానికి గల కారణాలను సైతం ఐఆర్‌డీఏఐ వివరించింది. ఇన్సూరెన్స్ పాలసీలో ఏదైనా లిటిగేషన్ ఉండటం, ఓపెన్ టైటిల్ లేదా రైవల్ క్లెయిమ్స్ ఉండటం, వినియోగదారులు యాన్యుటీ క్లెయిమ్స్ ఆప్షన్‌ని ఎంచుకోక పోవడం, ఇన్సూరెన్స్ పాలసీలను ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీ ఫ్రీజింగ్ లేదా బ్లాకింగ్ చేయడం వల్ల క్లెయిమ్ చేయలేరని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. అలాగే పాలసీదారులు దేశం విడిచి వెళ్లడం వంటి కారణాల వల్ల కూడా అన్‌క్లెయిమ్డ్ అమౌంట్స్ పెరిగిపోతున్నాయని పేర్కొంది. ఇలాంటి అన్‌క్లెయిమ్డ్ అమౌంట్స్ జాబితాను సదరు ఇన్సూరెన్స్ కంపెనీలు 10 ఏళ్ల వరకు వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే చేయాల్సి ఉందని.. ఆ తర్వాత వాటి వివరాలు అలాగే ఉంచాలని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.