ఇంటి రుణం టాపప్ తీసుకుంటున్నారా?
ఇల్లు కొని ఆరేడేళ్లు అవుతోందా.. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్నారా.. మీకు టాపప్ ఇస్తామని బ్యాంకులు ఫోన్లు చేస్తున్నాయా.. ఈ పేరుతో అదనంగా అప్పు తీసుకోబోయే ముందు కొన్ని వివరాలు తెలుసుకోవడం మంచిది.
టాపప్ గృహ రుణాలు గత కొంతకాలంగా చర్చల్లో నిలుస్తున్నాయి. వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగుతుండటం, కొత్త ఇళ్ల విక్రయాలు నెమ్మదించడంతో బ్యాంకులు ఇప్పటికే రుణాలు ఇచ్చిన వారిలో అర్హత ఉన్న వారికి కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. సాధారణంగా రెండు మూడేళ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్న వారు వీటిని ఎంచుకునేందుకు అర్హులు అవుతారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంటి విలువ పెరిగి ఉంటుంది. మీ ఆదాయంలోనూ వృద్ధి కనిపిస్తుంది. దీని ఆధారంగానే బ్యాంకులు, గృహరుణ సంస్థలు మీకు టాపప్ ఇచ్చేందుకు సిద్ధం అవుతాయి.
వ్యవధి సమానంగా...
గృహరుణ వ్యవధికి సమానంగానే బ్యాంకులు ఈ టాపప్ రుణమూ ఇస్తాయి. అంటే, ఇంకా 15 ఏళ్లపాటు గృహరుణ వ్యవధి ఉందనుకుంటే.. కొత్తగా ఇచ్చే ఈ రుణాన్నీ ఈ మేరకే ఇస్తాయి. ఈ రుణాలను రెండు మూడు వారాల్లోనే ఇస్తుంటాయి. చిన్న మొత్తంలో అవసరం అనుకుంటే.. వారం రోజుల్లోపే అందుతుంది.
కాస్త అధిక వడ్డీతో..
గృహరుణంతో పోలిస్తే టాపప్ రుణాలకు వడ్డీ కాస్త అధికంగా ఉండొచ్చు. కొన్ని బ్యాంకులు సాధారణ ఇంటి రుణంతో పోలిస్తే టాపప్ అప్పుపై 1 శాతం వరకూ అధిక వడ్డీని వసూలు చేస్తుంటాయి. అయినప్పటికీ వ్యక్తిగత, క్రెడిట్ కార్డు, బంగారంపై రుణాలతో పోలిస్తే ఇది తక్కువే అని చెప్పొచ్చు. ఇతర రుణాలన్నింటినీ ఒకే దగ్గరకు తీసుకొచ్చి, తక్కువ వడ్డీ రేటును చెల్లించాలి అనుకున్నప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
సులభంగానే..
గృహరుణం తీసుకున్నప్పుడే ఇంటికి సంబంధించిన అన్ని పత్రాలూ బ్యాంకు, ఆర్థిక సంస్థ తీసుకుంటుంది. కాబట్టి, కొత్తగా టాపప్ తీసుకోవడం సులభమే. కొన్ని నిర్ణీత పత్రాలను పూర్తి చేస్తే సరిపోతుంది. ఇంటి రుణం తీరేందుకు ఏడేళ్లకన్నా తక్కువ సమయం ఉన్నప్పుడు.. అధిక మొత్తంలో టాపప్ లభించే అవకాశాలున్నాయి.
బడ్జెట్‌కు అనుగుణంగా..
కొత్త రుణం తీసుకోవడం వల్ల మీ బడ్జెట్‌పై ఎంత మేరకు ప్రభావం పడుతుందో విశ్లేషించుకోండి. మీకు నిజంగా అవసరం ఉందని అనుకున్నప్పుడే ఈ రుణం తీసుకోవాలి. కేవలం ఇతర ఖర్చుల కోసమే అనుకుంటే.. దీర్ఘకాలిక వడ్డీ భారాన్ని మోయాల్సి వస్తుంది.
ఊహాజనిత ప్రయోజనాల కోసం ఈ రుణాన్ని ఉపయోగించకూడదు. అంటే.. స్టాక్ మార్కెట్లో లేదా ఇతర అధిక నష్టభయం ఉన్న పథకాల్లో మదుపు చేసి, లాభాలు సంపాదించాలనే ఆలోచన వద్దు. అనుకోని పరిస్థితుల్లో నష్టపోతే అప్పులు పెరిగిపోతాయి.
చాలామంది రుణదాతలు రుణ బదిలీ సమయంలో టాపప్ రుణాన్ని అందిస్తారు. మీ బ్యాంకు నుంచి టాపప్ తీసుకోలేని పరిస్థితుల్లోనే రుణాన్ని మరో చోటుకు మార్చుకోండి.
తీసుకున్న మొత్తాన్ని అంతిమంగా ఎలా వినియోగిస్తామనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి మరమ్మతులు, ఇతర అవసరాల కోసం చాలామంది.టాపప్ రుణాలను తీసుకుంటారు. పిల్లల ఉన్నత విద్యలాంటి వాటికీ వినియోగించుకోవచ్చు.
విహార యాత్రలు, వస్తువుల కొనుగోలు కోసం గృహరుణ టాపప్‌ను వినియోగించుకోవద్దు. దీనికోసం ఉన్న ప్రత్యేక రుణ పథకాలను పరిశీలించడం వల్ల తక్కువ సమయంలోనే అప్పులు తీరే అవకాశం ఉంటుంది.