CIBIL Score- How is the credit score calculated? How to increase it?
CIBIL Score | క్రెడిట్ స్కోర్ ఎలా లెక్కిస్తారు? దాన్ని పెంచుకునేందుకు ఏం చేయాలి?
CIBIL Score | ఇంటర్ విద్యార్థికి జేఈఈ మార్కులు ఎంత విలువైనవో, క్రికెటర్‌కు సెంచరీలు ఎంత ముఖ్యమో, సినిమా హీరోకు కలెక్షన్లు ఎంత ప్రధానమో, కవులూ రచయితలకు సాహిత్య పురస్కారాలు ఎంత కీలకమో.. వేతన జీవికి ‘క్రెడిట్ స్కోర్ ( Credit Score ) ‘ అంతే ప్రాణం. దాన్నిబట్టే.. క్రెడిట్ కార్డు పరిమితి నిర్ణయం అవుతుంది. బ్యాంకు రుణాలూ మంజూరు అవుతాయి. కాబట్టి, మంచి స్కోర్ సాధించాల్సిందే. ఆ విషయంలో దేని ప్రభావం ఎంతశాతం అన్నది ఉజ్జాయింపుగా..
35- 40%
గతమే ఆధారం క్రెడిట్ స్కోర్‌ను నిర్ణయించడంలో చెల్లింపు చరిత్ర అత్యంత కీలకం. బ్యాంకు వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లులు మొదలైనవి ఠంచనుగా చెల్లిస్తున్నారా లేదా అన్నది గమనిస్తారు. ఒక్క లావాదేవీలో వైఫల్యం ఉన్నా ఆర్థిక చరిత్ర మీద మచ్చ తప్పదు.
20- 25%
ఎంత వాడుకున్నారు? మీ క్రెడిట్ లిమిట్‌ను ఎంతమేర వాడుకున్నారన్నది కూడా ముఖ్యమే. రుణ పరిధి లక్ష రూపాయలు ఉంటే.. అందులో ముప్పై వేల వరకూ ఉపయోగించుకుని ఉంటే ఫర్వాలేదు. అంతకుమించితే , మీ చెల్లింపు సామర్థ్యాన్ని అనుమానిస్తారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని భావిస్తారు.
15- 20%
‘మిక్చర్’ పొట్లం ఒకే రకమైన రుణాలు ఉండటం కంటే కలగూర గంపలా.. తనఖా రుణం, వాహన రుణం, రెండు క్రెడిట్ కార్డులు, ఓ వ్యక్తిగత రుణం, ఓ గృహ రుణం- ఇలా రకరకాల అప్పులు ఉన్నట్టయితే మీ‘ క్రెడిట్ మిక్స్’ బ్యాలెన్స్‌గా ఉన్నట్టు.
10-15%
అనగనగా.. ఏడాదో, ఆరు నెలలో కాకుండా.. ఓ ఐదేండ్ల కాలంలోనో, పదేండ్ల కాలంలోనో మీ ఆర్థిక చరిత్ర ఎలా ఉందన్నదీ చూస్తారు. అప్పటినుంచీ ఇప్పటిదాకా తీసుకున్న రుణాలు ఏమిటన్నది ఆరా తీస్తారు. చెల్లింపు తీరును గమనిస్తారు, మొండిబాకీలు ఏమైనా ఉన్నాయా అన్నదీ పరిశీలిస్తారు. ఎక్కడా ఏ మచ్చా లేకపోతే స్కోరు పెరిగినట్టే.
10-15%
కొత్త అప్పులు గతం గొప్పగా ఉన్నంత మాత్రాన క్రెడిట్ స్కోర్ పెరిగిపోదు. ఈ రోజు, ఈ క్షణం.. నీ ఆర్థిక పరిస్థితి ఏమిటన్నది బేరీజు వేస్తారు. ఎన్ని బ్యాంకులకు, ఎన్నెన్ని ఆర్థిక సంస్థలకు మీరు అప్పు కోసం దరఖాస్తు చేశారన్నది లెక్క తేలుస్తారు. ఎన్ని అప్లికేషన్లు పెండింగ్‌లో ఉంటే.. మీరు అన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు. ఈ ఒక్క కారణం చాలు, స్కోరు పడిపోవడానికి.
5-10%
ఇతర అంశాలు కూడా.. మీ శాలరీ అకౌంట్‌లోపడే జీతంలో హఠాత్తుగా తగ్గుదల కనిపించినా, అసలే జీతం పడకపోయినా, చాలాకాలం పాటు మీ ఖాతా నుంచి మరొకరి ఖాతాకు భారీ మొత్తం బదిలీ అవుతున్నా మీ ఆర్థిక ప్రయాణంలో ఎత్తు పల్లాలు ఉన్నట్టు బ్యాంకులు భావిస్తాయి. అప్పులు ఇవ్వడానికి వెనకాడుతాయి.
ఎత్తు, బరువు, బీఎంఐ.. వీటితోపాటు సరైన బీపీ, షుగర్ లెవెల్స్ – మీ ఆరోగ్య చరిత్రకు ఎంత ముఖ్యమో క్రెడిట్ స్కోర్ కూడా ఆర్థిక చరిత్రకు అంతే ముఖ్యం. కాబట్టి, చక్కని ఆర్థిక స్కోరు ఉండేలా జాగ్రత్తపడండి.