Tuesday, March 8, 2022

How to prepare for UPSC Prelims Exam

 తొలి అడుగే బలంగా ఉండాలంటే..! ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ ఈ విధంగా చేస్తే..!

భారతదేశంలోనే ఉన్నత ఉద్యోగాలైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌లతో కలిపి 19 సర్వీసులకి సంబంధించిన 861 పోస్టులకుగాను సివిల్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదలైన విషయం తెలిసిందే.

నిర్ణీత వయోపరిమితికి తోడు డిగ్రీ విద్యార్హతగల అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. జనరల్‌ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 32 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీ్‌సమన్‌కు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షను మూడు అంచెలలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అనే మూడు దశలుగా నిర్వహణ ప్రక్రియ ఉంటుంది.


ప్రిలిమినరీ పరీక్ష

ప్రిలిమినరీ(ప్రాథమిక) పరీక్షను వడపోతగానే పరిగణించాలి. ఈ మార్కులను మెయిన్స్‌ దశకు చేరడానికి మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటారు. ఇది ఆబెక్టివ్‌ పరీక్ష.

ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపరు 200 మార్కులకు ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. అందువలన విద్యార్థి జాగ్రత్తగా వ్యవహరించాలి.

మొదటి పేపర్‌ జనరల్‌ స్టడీస్‌కి సంబంధించింది. దీనిలో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్‌ పరీక్షకి ఎంపిక చేస్తారు.

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో ప్రధానంగా భారతదేశ చరిత్ర, స్వాతంత్రోద్యమ చరిత్ర, భారతదేశ, ప్రపంచ భౌగోళికశాస్త్రానికి సంబంధించిన అంశాలు, పాలిటీలో భారత రాజ్యాంగం, పరిపాలన, పంచాయతీరాజ్‌ వ్యవస్థ వంటి అంశాలు, ఎకానమీలో సుస్థిరాభివృద్థి, పేదరికం, బడ్జెట్‌, ద్రవ్య విధానం, కోశ విధానం వంటి అంశాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో స్పేస్‌ టెక్నాలజీ, ఐటీ, రోబోటిక్స్‌, డిఫెన్స్‌, కమ్యూనికేషన్స్‌ తదితర అంశాలలో వర్తమానంలో వస్తున్న డెవల్‌పమెంట్స్‌, పర్యావరణానికి సంబంధించిన అంశాలు, జనరల్‌ సైన్స్‌, వర్తమాన జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

గత సంవత్సరం(2021) పరీక్ష పేపర్‌ను పరిశీలిస్తే చరిత్ర 20, జాగ్రఫీ 20, పాలిటీ 14, ఎకానమీ 15, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 12, పర్యావరణం 15, కరెంట్‌ అఫైర్స్‌కి సంబంధించి సుమారు 14 ప్రశ్నలు వచ్చాయి.

చరిత్రకి సంబంధించి 2012 నుంచి 2021 వరకు ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే అత్యల్పంగా 2017లో 14,  2014లో 22 ప్రశ్నలు వచ్చాయి. అలాగే ఈ సబ్జెక్టులో ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక భారతదేశ చరిత్రతోపాటు కళలు, సంస్కృతి(ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌)కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.

చరిత్రలో ప్రాథమిక అంశాలు బాగా చదవాలి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సింధు నాగరికతకి సంబంధించిన కట్టడాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ విషయమై ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత తవ్వకాల్లో బయల్పడిన కట్టడం గురించి అయినా అడగవచ్చు. లేదా సింధు నాగరికత పట్టణాలకి సంబంధించి ఏ అంశమైనా అడగవచ్చు. అందువలన ఈ మేటర్‌ అంతా పూర్తిగా చదివితే పరీక్షలో సులభంగా సమాధానాన్ని గుర్తించవచ్చు. టిప్పు సుల్తాన్‌కి సంబంధించి ఇటీవలి కాలంలో దిన పత్రికలలో వార్తలు బాగా వస్తున్నాయి. టిప్పు సుల్తాన్‌ గురించి చదవడంతోపాటు సమకాలీన రాజుల - రాజ్యాలను వివరంగా చదవాలి. శ్రీరామానుజాచార్య విగ్రహావిష్కరణ జరిగింది. ఆయన తత్వంతోపాటు ఇతర తత్వాలు కూడా చదవాలి.

చరిత్రకి సంబంధించి 6, 7, 8, 12వ తరగతి నూతన ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలతోపాటు ప్రాచీన భారతదేశ చరిత్ర(ఆర్‌.ఎ్‌స.శర్మ), మధ్యయుగ భారతదేశ చరిత్ర(సతీ్‌షచంద్ర), ఆధునిక భారతదేశ చరిత్ర(బిపిన్‌ చంద్ర), స్వాతంత్రోద్యమ చరిత్ర(బిపిన్‌ చంద్ర) పుస్తకాలు చదివితే  సమగ్ర అవగాహన కలుగుతుంది. ఇవి చదివితే 60-70ు మార్కులు సాధించినట్లే. వీటితోపాటు టాటా మెగ్రాహిల్‌, స్పెక్ట్రమ్‌, సివిల్‌ సర్వీసెస్‌ క్రానికల్‌ వంటి సంస్థలకి సంబంధించి ఏదైనా ఒక  స్టాండర్డ్‌ పుస్తకం చదివితే సరిపోతుంది.

జాగ్రఫీని తీసుకుంటే అత్యల్పంగా 2016లో 7 ప్రశ్నలు రాగా, అత్యధికంగా 2013లో 18 వచ్చాయి. జాగ్రఫీకి సంబంధించి భారతదేశ భౌగోళిక పరిస్థితులేగాక వరల్డ్‌ జాగ్రఫీలో భౌతిక భౌగోళిక అంశాలపై ప్రధానంగా ప్రశ్నలు వస్తాయి.

ఉదాహరణకి టోంగా అగ్నిపర్వతం ఇటీవల వార్తల్లో వచ్చింది. టోంగా అగ్నిపర్వతంపై అధ్యయనంలో భాగంగా అగ్నిపర్వతం(ఓల్కనో) రకాలు, ఏర్పడటానికి కారణాలు, అసలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి అంశాలు చదువుకోవాలి.

ఇటీవలి బడ్జెట్‌లో నదుల అనుసంధానం ప్రస్తావనకు వచ్చింది. కెన్‌-బెట్వా అనుసంధానం గురించి చదవాలి. నదులు, వాటి ఉపనదులను మ్యాప్‌ ద్వారా నేర్చుకోవాలి. ఫారెస్ట్‌ రిపోర్ట్‌ 2021 ప్రకారం అడవుల విస్తీర్ణం పెరిగింది. అడవుల రకాలు, విస్తీర్ణం, ఏ రాష్ర్టాల్లో ఏవిధంగా ఉంది, సమగ్రంగా చదవాలి. మడ అడవులపై ప్రత్యేకంగా చదవాలి. ఇండియాలో రామ్‌సర్‌ సైట్స్‌ 47 నుంచి 49కి పెరిగాయి. చిత్తడినేలలు అంటే ఏమిటో, ఎక్కడెక్కడ ఉన్నాయో చదువుకోవాలి.  ఏటా ఏదైనా ఒక సముద్రం సరిహద్దులను పరీక్షలో అడుగుతున్నారు. దేశ సరిహద్దులు, సమగ్ర సరిహద్దులను మ్యాప్‌ పాయింటింగ్‌ ఆధారంగా చదువుకోవాలి.

జాగ్రఫీకి సంబంధించి 6-12 ఎన్‌సీఈఆర్‌టి బుక్స్‌ బాగా చదివితే సరిపోతుంది. వీటితోపాటు ఏదైనా ఒక స్టాండర్డ్‌ బుక్‌ చదివితే మంచిది.

పాలిటీకి అంతర్జాతీయ అంశాలకు సంబంధించి అత్యల్పంగా 2016లో 7 ప్రశ్నలు రాగా, అత్యధికంగా 2017లో 22 వచ్చాయి. పాలిటీలో భారత రాజ్యాంగంలోని అంశాలకు వర్తమానంలోని విషయాలను జోడించి చదవాలి.

ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్యాంగం గురించి మాట్లాడారు. ఇది దేశంలోనే చర్చనీయాంశమైంది. రాజ్యాంగం అంటే ఏమిటి? భారత రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారు, దానిలోని మౌలికాంశాలు, రాజ్యాంగంలోని అంశాలను ఎక్కడ నుంచి తీసుకున్నారు వంటివన్నీ చదవాలి. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుల గురించి చదవాలి. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన ముఖ్యమైన తీర్పులను చదవాలి. వివిధ కమిటీల రిపోర్ట్‌లు చదవాలి. మహిళ వివాహ వయస్సుకి  సంబంధించిన అంశాలతోపాటు వారికి సంబంధించిన హక్కులు చదవాలి. ఓబీసీ జాబితాకి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఎస్సీ, ఎస్టీలకి చెందిన రాజ్యాంగ ఆర్టికల్స్‌, వారి కోసం నియమించిన కమిషన్‌లను అధ ్యయనం చేయాలి. 

పాలిటీలో ముఖ్యంగా ఎన్‌సీఈఆర్‌టి - ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ ఎట్‌ వర్క్‌ అనే 11వ తరగతి పుస్తకం చదవాలి. ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌ పుస్తకంతోపాటు లక్ష్మీకాంత్‌ ఇండియన్‌ పాలిటీలో స్టాండర్డ్‌ బుక్‌ ఒకటి చదవాలి. పాలిటీ  విషయంలో ముఖ్యంగా వర్తమాన అంశాలు కలుపుకొని చదవాలి. రాజ్యాంగ ప్రకరణలపై అవగాహనకు రావాలి.

ఎకానమీని పరిశీలిస్తే 2014లో 10 ప్రశ్నలు రాగా 2013లో 19 వచ్చాయి. ఎకానమీకి సంబంధించిన మౌలిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. బడ్జెట్‌, ఎకనమిక్‌ సర్వే నుంచి కూడా అధికంగా ప్రశ్నలు వస్తాయి. 

ఇటీవలి కాలంలో ఎంఎస్‌పీ, ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ, క్రిప్టోకరెన్సీ వంటి అంశాలు వినబడుతున్నాయి. ఎంఎ్‌సపీ(కనీస మద్దతు ధర) అంటే ఏమిటి? ఎవరు ఇస్తారు? ఏయే పంటలకు ఇస్తారు వంటివాటిపై దృష్టిపెట్టాలి. చక్కెరకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటీకరణకి సంబంధించి వివరంగా చదవాలి.

బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కచ్చితంగా చదవాలి. పీఎల్‌ఐకితోడు ఏయే రంగాల్లో ఆ పథకాన్ని అమలు చేస్తున్నారో పరిశీలించాలి. ఎకనామిక్‌ సర్వే కచ్చితంగా దృష్టి సారించాలి.

ఎకానమీకి సంబంధించి ఎన్‌సీఈఆర్‌టి 9-12 పుస్తకాలు చదవడం ద్వారా మౌలిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. బడ్జెట్‌ 2022-23, ఎకనామిక్‌ సర్వే 2021-22 బాగా చదవాలి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఏదైనా ఒక స్టాండర్డ్‌ బుక్‌ రిఫరెన్స్‌గా చూసుకోవాలి.

జనరల్‌ సైన్స్‌, శాస్త్ర సాంకేతికతకి సంబంధించి 2019లో 7 ప్రశ్నలు అత్యల్పంగా, 2014లో అత్యధికంగా 16 వచ్చాయి. సాధారణ సైన్స్‌లో వ్యాధులు, విటమిన్‌లు; వృక్ష, జంతువుల విషయంలో సాధారణ అంశాలతోపాటు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో కమ్యూనికేషన్స్‌, స్పేస్‌, ఐటీ, రోబోటిక్స్‌, బయోటెక్నాలజీ, డిఫెన్స్‌ వంటి అంశాల్లో నూతన ఆవిష్కరణలు, సమకాలీన డెవల్‌పమెంట్స్‌పై ప్రశ్నలు అధికంగా వస్తాయి.

ఇటీవలి కాలంలో భారతదేశంతోపాటు ఇతర దేశాల అంతరిక్ష ప్రయోగాల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంగారకుడిపై ప్రయోగాల గురించి చదవాలి. క్షిపణుల గురించి, ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహ వాహన నౌకల గురించి చదవాలి. ఆ నౌకల ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహాల గురించి చదవాలి. జీఐ(జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) గురించి తెలుసుకోవాలి.

ఒమిక్రాన్‌ వైరస్‌ గురించి విస్తృతంగా వార్తలు వస్తున్నాయి. ఆ వైరస్‌ అంటే ఏమిటి? వైరస్‌ సంక్రమణ, సంబంధిత వ్యాధు లు,  నివారణ చర్యలను గమనిస్తూ ఉండాలి. 

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి 6-10వ తరగతి వరకు ఎన్‌సీటీఆర్‌టీపుస్తకాలు చదవాలి. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వర్తమాన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ప్రాథమిక అంశాలు చదివి కరెంట్‌ అఫైర్స్‌తోపాటు. వివిధ మంత్రిత్వశాఖల ఇయర్‌ ఎండ్‌ రివ్యూతోపాటు అప్‌డేట్స్‌పై దృష్టిపెడితే మంచిది. ఇందులో ప్రాథమిక అంశాలకు రవి అగ్రహారి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ బుక్‌ చదివితే మంచిది.

పర్యావరణంపై 2020లో 10 ప్రశ్నలు రాగా 2014, 2016లో చెరి 18 వచ్చాయి. పర్యావరణంలో జీవవైవిధ్యం, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ చట్టాలు, పర్యావరణ సంస్థలు, కమిటీలు, సమావేశాలపై ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు పర్యావరణ కాలుష్యానికి సంబంధించి భూ, జల, గాలి కాలుష్యం, రేడియోధార్మికత కాలుష్యం, కాలుష్య నివారణ చట్టాలు, నివారణ చర్యలు, ఓజోన్‌ పొరక్షీణత, గ్లోబల్‌ వార్మింగ్‌పై ప్రశ్నలు వస్తాయి.

కాప్‌-26 సదస్సు గురించి చదువుతూ గతంలో జరిగిన సదస్సులు, వాటి తీర్మానాలను చదవాలి. ఏ సదస్సు, ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకున్నదో తెలుసుకోవాలి. 

గత సంవత్సర కాలంలో రెడ్‌ లిస్టుకి సంబంధించి అంతరించిపోతున్న జీవజాతులు, వృక్షజాతుల గురించి చదవాలి. ఆ జాతులకి సంబంధించిన జంతువు, వృక్షాలు తదితరాలు తెలుసుకోవాలి.   వీటికి సంబంధించి భారతదేశంలో చట్టాలకి అన్వయించుకోవాలి.

ఈ టాపిక్‌లో ఎన్‌సీఈఆర్‌టీ ఎన్విరాన్‌మెంట్‌తోపాటు శంకర్‌ అకాడమీ ‘అవర్‌ ఎన్విరాన్‌మెంట్‌’ లేదా  రవి అగ్రహారి ‘ఎన్విరాన్‌మెంట్‌’  లేదా ‘పీఎంఎ్‌ఫఐఎఎస్‌ ఎన్విరాన్‌మెంట్‌’ బుక్‌ తదితరాలను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి పుస్తకంతోపాటు బయాలజీ 11లోని 13-16 చాప్టర్స్‌ (ఎన్విరాన్‌మెంట్‌ బయాలజీ) చదవాలి.

వర్తమాన అంశాలకు సంబంధించి 2012లో ఒక ప్రశ్న రాగా, 2016లో 27 వచ్చాయి. వర్తమాన అంశాలు అంటే గత సంవత్సర కాలంలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ అంశాలను పరిశీలించాలి. వీటితోపాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, సూచికలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇటీవలి కాలంలో క్రీడలకు ప్రాధాన్యం పెరిగింది. వీటికి సంబంధించి పీఐబీ వెబ్‌సైట్‌, ద హిందూ పేపర్‌ చదువుతూ ఏదైనా ఒక  ప్రముఖ సంస్థకి చెందిన కరెంట్‌ అఫైర్స్‌ మ్యాగజైన్‌ ఫాలోకావడం మంచిది. 

వీటితోపాటు ముఖ్యంగా జనరల్‌ స్టడీస్‌కి సంబంధించిన ప్రాక్టీస్‌ పేపర్‌లు రాయాలి. సుమారు 50-60 ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్‌ చేస్తే మీపై మీకు నమ్మకం ఏర్పడుతుంది. ముఖ్యంగా గత 20 సంవత్సరాలలో జరిగిన సివిల్స్‌ ప్రిలిమినరీ ప్రశ్నాపత్రాలు ప్రాక్టీస్‌ చేయాలి.

2020 ప్రిలిమ్స్‌ పేపర్‌ కట్‌-ఆఫ్‌ మార్కులకు + లేదా - 5 మార్కులు అంచనా వేసుకుని  ముందస్తు ప్రణాళిక చేసుకుంటే మెయిన్స్‌కి మార్గం సుగమం అవుతుంది.

ప్రిలిమ్స్‌కి సంబంధించి రెండో పేపర్‌ సీశాట్‌ను 200 మార్కులకిగాను 80 ప్రశ్నలతో నిర్వహిస్తారు. ఈ పేపర్‌ క్వాలిఫైయింగ్‌ పేపర్‌ మాత్రమే. ఈ పేపర్‌లో 33ు మార్కులు సాధించాలి.

ఈ పేపర్‌లో సాధారణ న్యూమరసీ, అర్థమెటిక్‌, లాజికల్‌ రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, గ్రాఫ్స్‌, టేబుల్స్‌ సంబంధించి పదో తరగతి పరిజ్ఞానం సరిపోతుంది. ఇంగ్లీష్‌ ప్యాసేజ్‌లు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

రీజనింగ్‌, అర్థమెటిక్‌ సంబంధించి చాంద్‌ బుక్స్‌గాని, అరిహంట్‌ బుక్స్‌ చదవాలి. ఇంగ్లీష్‌ పాసేజ్‌లకి సంబంధించి టాటా మెగ్రాహిల్‌ లేదా అరిహంత్‌ లేదా పియర్సన్‌ బుక్స్‌ చదవాలి.

ప్రిలిమినరీ పరీక్షకి చదువుతూ మెయిన్స్‌కి సంబంధించి కూడా చరిత్ర, భూగోళం,  ఎకానమీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పాలిటీలను అనుసంధానం చేసుకుని చదవాలి. తద్వారా మెయిన్స్‌కి ప్రిలిమ్స్‌ తరవాత చదవడం కూడా సులభతరమవుతుంది.