బ్యాంక్ ఖాతా నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. పిల్లలకు నేర్పండి
ఇంటర్నెట్ డెస్క్: *పిల్లల పొదుపు అలవాటుకు తల్లిదండ్రులు వేసే మొదటి అడుగు పిగ్గీ బ్యాంక్. ఏదైనా సందర్భంలో చిరుతిళ్లు కోసం ఇచ్చే డబ్బు లేదా వారి పుట్టిన రోజు, ఇతర పండుగ రోజుల్లో అమ్మమ్మ, తాతయ్యలు ఇచ్చే డబ్బును దాచుకోవాలని చెప్తుంటారు తల్లిదండ్రులు. ఇందుకోసం పిగ్గీ బ్యాంక్‌ను కొనిస్తారు. ఇతర డబ్బు సంబంధిత విషయాలను చెప్పేందుకు ఇష్టపడరు. కానీ పొదుపుతో పాటు ఖర్చులు, డబ్బు నిర్వహణ వంటివీ పిల్లలకు తెలియాలి.
ఏదైనా విషయాన్ని మాటల్లో చెప్పడం కంటే ప్రాక్టికల్‌గా చేస్తే, పిల్లలు త్వరగా నేర్చుకుంటారు. వారి చేత చేయిస్తే ఇప్పుడు నేర్చుకున్న పాఠం జీవితంలో ప్రతి దశలోనూ గుర్తుంటుంది. అందుకే చిన్న వయసు నుంచే డబ్బు నిర్వహణ పట్ల అవగాహన కల్పించాలి. ఇందుకోసం పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పనిలేదు. డబ్బు సంబంధిత విషయాలను నేర్పేందుకు మొదటి అడుగుగా బ్యాంక్ ఖాతాను తెరవొచ్చు. ప్రస్తుతం చాలా వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పిల్లల పేరుతో ఖాతాను తెరిచే వీలు కల్పిస్తున్నాయి. అయితే, చైల్డ్ బ్యాంక్ ఖాతాకు కొన్ని రూల్స్ ఉంటాయి. తల్లిదండ్రులు చైల్డ్ బ్యాంక్ ఖాతాను తెరిచే ముందు వీటిని తెలుసుకోవాలి. అలాగే ఖాతాను ఏవిధంగా నిర్వహించాలో చెప్పడంతో పాటు.. బ్యాంక్ స్టేట్‌మెంట్, ఏటీఎం కార్డ్ తదితర అంశాలను దగ్గరుండి నేర్పించాలి.
వయసు ఆధారంగా ఖాతాలు..
18 కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల కోసం తెరిచే ఖాతాలను బ్యాంకులు మైనర్ ఖాతాలుగా గుర్తిస్తాయి. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి 10 సంవత్సరాల లోపు పిల్లలకు.. ఈ ఖాతాను పిల్లలు, తల్లిదండ్రులు/గార్డియన్ జాయింటుగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇక రెండోది 10 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకు.. ఈ ఖాతాను తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు స్వయంగా నిర్వహించుకోవచ్చు. 18 ఏళ్లు దాటిన తరువాత ఈ ఖాతా సాధారణ పొదుపు ఖాతాగా బ్యాంకులు మారుస్తాయి.
నేర్పించాల్సిన అంశాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మైనర్ ఖాతాలలో ఇంటెర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎమ్/డెబిట్ కార్డ్ చెక్ బుక్ సౌకర్యం మొదలైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిపై కొన్ని ఆంక్షలు కూడా ఉంటాయి. వాటిని పూర్తిగా తెలుసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ఫీచర్లను ఎనేబుల్ చేసేప్పుడు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లతో సురక్షింగా ఉపయోగించడం గురించి తెలియజేయాలి.
మీ పిల్లలకు చెక్‌బుక్ చూపించి దానిలోని అంశాలను పూర్తిగా వివరించండి. చెక్ ద్వారా కొంత డబ్బును విత్‌డ్రా చేసి డెబిట్, క్రెడిట్ ఎంట్రీలు స్టేట్‌మెంట్‌లో ఏవిధంగా ప్రతిబింబిస్తాయో నేర్పించండి.
మైనర్ ఖాతాలో ప్రతి నెలా స్థిర మొత్తాన్ని మీ ఖాతా నుంచి బదిలీ చేయాలనుకునే వారికి ‘స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్’ సౌకర్యం కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. దీని ద్వారా ప్రతి నెలా మీ పిల్లల పాకెట్ మనీ కోసం ఇచ్చే మొత్తాన్ని మీ బ్యాంక్ ఖాతా నుంచి పిల్లల బ్యాంక్ ఖాతాకు నేరుగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అలాగే నెఫ్ట్ మోడ్ ద్వారా కూడా నిధుల బదిలీ సాధ్యపడుతుంది. ఈ ఫీచర్ల ఉపయోగం గురించి పిల్లలకు వివరించండి.
కొన్ని బ్యాంకులు ఫోటో ఏటీఎమ్ కార్డులను జారీ చేస్తాయి. వాటిపై తల్లిదండ్రుల పేరు కూడా నమోదు చేయవచ్చు. మీ పాప/ బాబును ఏటీఎమ్‌కు తీసుకెళ్లి.. ఏటీఎమ్ కార్డు సురక్షితంగా వాడే విధానాన్ని తెలియజేయాలి.
వాస్తవానికి బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించిన ప్రతిసారీ పిల్లలకు సురక్షితమైన బ్యాంకింగ్ ఫీచర్లను చెప్పడం అవసరం. ఏటీఎం లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేసినప్పడు.. ఎలా చేయాలో చెప్పడంతో పాటు ఎలాంటి తప్పులు చేయకూడదో కూడా నేర్పించాలి.
పిల్లల బ్యాంక్ ఖాతాకి సంబంధించి.. రోజువారీ, వార్షిక వ్యయాలపై ముందుగానే పరిమితి (ప్రీ-సెట్ లిమిట్) విధించవచ్చు. అలాగే ఏదైనా లావాదేవీ జరిగితే తల్లిదండ్రులు/గార్డియన్ మైబైల్‌కి మేసేజ్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల వాళ్లకు ఆర్థిక స్వేచ్చ ఇచ్చినట్లు ఉంటుంది. అదే సమయంలో నియంత్రణ కూడా తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది.
తల్లిదండ్రులు చూడాల్సిన మరో ముఖ్య విషయం నెలవారీ సగటు బ్యాలెన్స్. పిల్లలు నెలవారీ సగటు బ్యాలెన్స్‌ని నిర్వహిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు చూడాలి. దీని గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి. లేదంటే పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది.
పిల్లల కోసం ఖాతా తెరిచేటప్పుడు బ్యాంకులు అందించే అంతర్గత రక్షణ, భద్రత ఫీచర్లు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మీ పిల్లల పేర్లపై ఖాతాను తెరిచేప్పుడు వారిని బ్యాంకుకు తెసుకెళ్లి మంచి ప్రారంభాన్ని ఇవ్వండి.
దేశీయ అతిపెద్ద బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వ్యక్తిగత బ్యాంకింగ్ సేవల విభాగంలో ‘పెహ్ల కదమ్’, ‘పెహ్లీ ఉడాన్’ అనే రెండు రకాల పొదుపు ఖాతాలు మైనర్ పిల్లల కోసం అందిస్తోంది. ఈ ఖాతాల వివరాలు ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ పెహ్లా కదమ్ ఖాతా: మైనర్ పిల్లలు ఏ వయసులోనైనా ఈ ఖాతాను ప్రారంభించొచ్చు. కానీ ఈ ఖాతా తల్లిదండ్రులు లేదా సంరక్షకుడితో కలిపి ఉమ్మడి ఖాతాగా ప్రారంభించాలి.
1. ఎస్‌బీఐ పెహ్ల కదమ్ ఖాతా లావాదేవీల విలువ ఇంటెర్నెట్ బ్యాంకింగ్‌తో అయితే రోజుకు రూ.5000 వరకే పరిమితి ఉంది. అదే మొబైల్ బ్యాంకింగ్ అయితే రోజుకు రూ.2000
2. ఎస్‌బీఐ పెహ్ల కదమ్ వడ్డీ రేటు, ఎస్‌బీఐ పొదుపు ఖాతాకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ లక్ష రూపాయల కంటే తక్కువ డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
3. ఈ ఖాతాపై పిల్లల ఫోటో కలిగిన ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును మైనర్‌తో పాటు తల్లిదండ్రుల పేరుతో జారీచేస్తారు. ఏటీఎం లేదా పీఓఎస్ వద్ద రూ.5000 వరకు లావాదేవీలు చేయొచ్చు.
4. పర్సనల్ చెక్‌బుక్ (10 చెక్కులతో కలిగిన) సంరక్షకుడికి మైనర్ పిల్లల పేరుతో జారీచేస్తారు.
ఎస్‌బీఐ పెహ్లీ ఉడాన్ ఖాతా
1. ఈ ఖాతాను కేవలం మైనర్ పిల్లల పేరుతో ప్రారంభించొచ్చు. అయితే, వారి వయసు 10 ఏళ్లకు ఎక్కువగా ఉండాలి.
2. ఈ ఖాతా పరిమితి ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే రోజుకు రూ.5000.. మొబైల్ బ్యాంకింగ్‌తో అయితే రోజకు రూ.2000 వరకు లావాదేవీల పరిమితి ఉంది.
3. వడ్డీ రేట్లు ఎస్‌బీఐ పొదుపు ఖాతా మాదిరిగానే ఉంటుంది.
4. ఎస్‌బీఐ పెహ్లీ ఉడాన్ ఖాతాపై పిల్లల ఫోటో కలిగిన ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును రూ.5000 లావాదేవీల పరిమితితో పిల్లల పేరిట జారీచేస్తారు.