లక్షల జీతాలిచ్చే.. ఉద్యోగాలు ఇవే..!
ఉద్యోగం చేస్తున్నా అంటే అందరూ టక్కున అడిగే ప్రశ్న.... జీతం ఎంత? కంపెనీ, హోదా, ఇతర సౌకర్యాలు.. ఇలా ఎన్ని ఉన్నప్పటికీ చర్చ అంతా వేతనం చుట్టూనే సాగుతుంది. ఫలానా అభ్యర్థికి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో భారీ ఆఫర్ వచ్చింది అనే వార్తలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఐదేళ్ల క్రితం వరకు ఫ్రెషర్ ట్యాగ్‌తో జాబ్ మార్కెట్లో ప్రవేశించే గ్రాడ్యుయేట్లకు అనుభవం ఉన్న వారితో చూసుకుంటే తక్కువ వేతనమే లభించేది. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. నైపుణ్యం ఉంటే చాలు అనుభవం వారి ఉన్న కంటే ఎక్కువ వేతనాన్ని తాజా గ్రాడ్యుయేట్లు అందుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మూడేళ్ల తరవాత పొందే జీతాన్ని ఫ్రెషర్స్ కెరీర్ ప్రారంభంలోనే దక్కించుకోవచ్చు. అలాంటి కొన్ని కెరీర్స్ గురించి తెలుసుకుందాం..
గతంతో పోల్చుకుంటే కొన్ని కెరీర్‌లలో ప్రస్తుతం జూనియర్ స్థాయి ఉద్యోగులకు సైతం భారీ స్థాయిలోనే వేతనాలు అందుతున్నాయి. ఐదేళ్ల క్రితం కంటే మూడు రెట్లు అధిక జీతాలను ఇప్పటి తాజా గ్రాడ్యుయేట్లు పొందుతున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలకు ప్రస్తుత జాబ్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ రంగాల్లో ప్రతిభావంతులైన ఫ్రెషర్స్‌ను కళ్లు చెదిరే ప్యాకేజీలతో నియమించుకోవడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.
బిగ్ డేటా.. ఏఐ
బిగ్ డేటా అనలిటిక్స్ నిపుణులకు కెరీర్ ప్రారంభంలోనే ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. ప్రతిభ ఉన్న అనలిటిక్స్ నిపుణులకు కార్పొరేట్ కంపెనీలు ప్రారంభంలో నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తున్నాయి. సాధారణ ఐటీ నిపుణులతో పోలిస్తే అనుభవం ఉన్న డేటా అనలిటిక్స్ నైపుణ్యాలు ఉన్నవారికి 30 నుంచి 50 శాతం అధిక వేతనాలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇక 2025 నాటికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మన నిత్య జీవితంలో విడదీయరాని భాగంగా మారే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
భవిష్యత్‌లో విద్య, వైద్యం, వ్యాపార, వాణిజ్య రంగాల్లో సొంతంగా సమస్యలను పరిష్కరించడం, డేటాను మేనేజ్ చేయటం వంటి పనులను నిర్వహించే సామర్థ్యం ఉన్న కంప్యూటర్స్, మెషీన్స్ వినియోగం ఎక్కువ అవుతుంది. ఫలితంగా ఆయా వ్యవస్థల అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన మెషీన్స్, కంప్యూటర్లను పెద్ద ఎత్తున రూపొందించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో ఏఐ నిపుణులకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ రంగంలో కనీసం రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల మధ్య వార్షిక వేతనాలు లభిస్తాయి.
ఫుల్ స్టాక్ / సాఫ్ట్‌వేర్ డెవలపర్
ప్రస్తుతం దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న వృత్తుల్లో ఫుల్ స్టాక్ డెవలర్ - సా్‌ఫ్టవేర్ డెవలపర్ ఒకటి. పని చేస్తున్న ప్రదేశం, కంపెనీని బట్టి ఫుల్‌స్టాక్ డెవలర్ సంవత్సరానికి 3 నుంచి 10 లక్షల రూపాయల వేతనాన్ని అందుకుంటాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగంతో కొంత అనుభవం తరవాత మాత్రమే పొందే ఆదాయాన్ని ఫుల్ స్టాక్ డెవలర్ - సా్‌ఫ్టవేర్ డెవలపర్ ప్రారంభంలోనే అందుకోవడం విశేషం. మన దేశంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సరాసరి వేతనం ఏడాదికి రూ. 3.6 లక్షలు మాత్రమే.
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్
దేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంబంధిత రంగాల్లో నైపుణ్యం ఉన్న మానవ వనరులకు చక్కని డిమాండ్ ఉంది. విశ్లేషణ సామర్థ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ / మేనేజింగ్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు మెరుగ్గా ఉంటే ఫ్రెషర్స్ కూడా ఇన్వె్‌స్టమెంట్ బ్యాంకర్ / బ్యాంకింగ్ అనలిస్ట్‌గా సరాసరి ఏడాదికి రూ. 10 నుంచి 25 లక్షల వేతనాన్ని అందుకోవచ్చు. సబ్జెక్ట్ నాలెడ్జ్, పని చేస్తున్న ప్రదేశం, డొమైన్, కంపెనీ వంటి విషయాలు ఈ రంగంలో వేతనాన్ని అమితంగా ప్రభావితం చేస్తాయి.
డేటా సైంటిస్ట్
ఒక తాజా గ్రాడ్యుయేట్ ఏదైనా కంపెనీలో డేటా సైంటిస్ట్‌గా చేరితే సంవత్సరానికి అందుకునే సరాసరి వేతనం రూ. 11.5 లక్షలు. అయితే అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానం (సబ్జెక్ట్ నాలెడ్జ్)పైనే అతని పే ప్యాకేజీ ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు. బీఎ్‌ఫఎ్‌సఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్), ఎనర్జీ, ఫార్మా, ఈ-కామర్స్ రంగాల్లో డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు చాలా డిమాండ్ ఉంది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలు ఇటువంటి ఉద్యోగాలకు హబ్‌గా నిలుస్తున్నాయి. అసెంచర్, అమెజాన్, కేపీఎంజీ, డెలాయిట్, హోనీవెల్, డెల్ ఇంటర్నేషనల్ ఈ రంగంలో టాప్ రిక్రూటర్స్.
సేల్స్‌ఫోర్స్ ఇంజనీర్
క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో సేల్స్‌ఫోర్స్ ఇంజనీర్‌కు చక్కని అవకాశాలు ఉన్నాయి. ఒక సేల్స్‌ఫోర్స్ ఇంజనీర్ కెరీర్ ప్రారంభంలో సంవత్సరానికి రూ. 5 లక్షల పే ప్యాకేజ్‌ను అందుకుంటాడు. కొంత అనుభవం గడిస్తే ఒక ఏడాది కాలంలోనే రూ. 7 - 12 లక్షల వేతనాన్ని అందుకోవచ్చు.
మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్
మేనేజ్‌మెంట్ రంగంలో కూడా ఆకర్షణీయమైన వేతనాలు ఫ్రెషర్స్‌కు స్వాగతం పలుకుతున్నాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్, విశ్లేషణ సామర్థ్యం ఉన్న మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు.. మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్లుగా సంవత్సరానికి సరాసరి రూ. 8 లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు. అయితే ఐటీ కన్సల్టింగ్, బిజినెస్ స్ర్టాటజీ, సప్లయి చైన్ వంటి అంశాల్లో మంచి అవగాహన ఉంటే కెరీర్‌పరంగా మరింత ప్రయోజనం చేకూరుతుంది.
కమర్షియల్ పైలట్
దేశంలో అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగాల్లో ఇది ఒకటి. ప్రయాణాల పట్ల ఆసక్తి ఉన్న వారికి సరిగ్గా సరిపోయే జాబ్ కమర్షియల్ పైలట్. సంబంధిత పైలట్ శిక్షణ ముగించుకొని పూర్తిస్థాయి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే సమయంలో సంవత్సరానికి లభించే సరాసరి వేతనం రూ. 23 లక్షలు.
చార్టర్డ్ అకౌంటెంట్
ఈ మధ్య కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రొఫెషన్స్‌లో చార్టర్డ్ అకౌంటెన్సీ ఒకటి. ఫ్రెషర్ ట్యాగ్‌తోనే సీఏ పొందే సరాసరి వేతనం సంవత్సరానికి రూ. 6 లక్షలు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో రూ. 8 లక్షల వరకు వేతనాన్ని ఆఫర్ చేస్తుంటారు.