Tuesday, August 13, 2019

సిలబస్‌ కొండను ఢీ కొట్టడమెలా? సచివాలయ పరీక్షల ప్రత్యేకం

సిలబస్‌ కొండను ఢీ కొట్టడమెలా? సచివాలయ పరీక్షల ప్రత్యేకం

సిలబస్‌ కొండను ఢీ కొట్టడమెలా?


కొద్ది రోజుల్లోనే సర్కారీ కొలువులో కుదురుకునే అరుదైన అవకాశం వచ్చింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులు ఒక్కసారిగా అందివస్తున్నాయి. పరీక్ష తేదీ దూసుకొచ్చేస్తోంది. అవగాహన లోపంతో, అస్పష్టతతో ఏ చిన్న తప్పటడుగు వేసినా అదృష్టం తల్లకిందులైపోతుంది. సాధారణ అభ్యర్థులు, సాంకేతిక విద్యార్థులు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళికలు రూపొందించుకోవాలో పరిశీలించుకోవాలి. పోటీ పరిస్థితులను అంచనా వేసుకొని, ఎదుర్కోడానికి తగిన స్వీయ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి.

సిలబస్‌ కొండను ఢీ కొట్టడమెలా? సచివాలయ పరీక్షల ప్రత్యేకం/2019/08/how-to-prepare-for-ap-grama-sachivalayam-recruitment-exam.html


ప్రిపరేషన్‌ విధానం



గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రకటించిన  పోస్టులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. టెక్నికల్‌ పోస్టులు, నాన్‌ టెక్నికల్‌ పోస్టులు.
* సాంకేతిక విద్యార్హతలతో, ఉద్యోగ బాధ్యతలు ప్రత్యేక తరహావి టెక్నికల్‌ పోస్టులు. గ్రామ ఫిషరీస్‌ అసిస్టెంట్‌, గ్రామ పశు సంవర్ధక అసిస్టెంట్‌, గ్రామ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌, గ్రామ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌, గ్రామ సెరికల్చర్‌  అసిస్టెంట్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, గ్రామ సర్వేయర్‌ గ్రేడ్‌-2, డిజిటల్‌ అసిస్టెంట్‌, వార్డ్‌ శానిటేషన్‌ సెక్రటరీ, వార్డ్‌ ప్లానింగ్‌, రెగ్యులేషన్‌ సెక్రటరీ, వార్డ్‌ వెల్ఫేర్‌, డెవలప్‌మెంట్‌ సెక్రటరీ పోస్టులు సాంకేతిక స్వభావం ఉన్నవి.
* పంచాయతీ సెక్రటరీ గ్రేడ్‌-5,  మహిళా పోలీస్‌, విమెన్‌- చైల్డ్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ లేదా వార్డ్‌ ఉమన్‌, వీకర్‌ సెక్షన్‌ ప్రొటెక్షన్‌ సెక్రటరీ, వార్డ్‌ వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, వార్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులు నాన్‌ టెక్నికల్‌ తరహాకు చెందినవి.
వీటిలో ఏదైనా డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకున్న కేటగిరి-1 పోస్టులు పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-5), వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, వార్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, మహిళా పోలీసు, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్‌ లేదా వార్డు మహిళా ప్రొటెక్షన్‌ సెక్రటరీ.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల్లో రెండు రకాల వారున్నారు. మొదటి తరహా అభ్యర్థులు సాధారణ బీఎస్సీ, బీకాం, బీఏ  వంటి సాంప్రదాయిక డిగ్రీలు చేసినవారు. వీరిలో ఏ విధమైన అస్పష్టత లేదు. మొత్తంలో వీరికి అవకాశం ఉన్నవి నాలుగు కేటగిరీలే కాబట్టి నేరుగా దరఖాస్తు చేసి ప్రిపరేషన్‌లో పడ్డారు. ఇప్పుడు వచ్చిన దరఖాస్తుల్లో వీళ్లవే ఎక్కువ భాగం.  వీరిలో మళ్ళీ రెండు రకాల వారున్నారు. ఇందులో రిపీటర్లు అంటే గతంలో గ్రూప్స్‌లో వివిధ పరీక్షలు రాసినవారు. ఇన్ని పోస్టులు మరెప్పుడూ రావు కాబట్టి రిపీటర్స్‌కు ఇది విజయమో వీరస్వర్గమో. రిపీటర్స్‌ ఇప్పటికే సన్నద్ధతకి దిగిపోయారు. ముఖ్యంగా రాతపరీక్షల అనుభవాల రీత్యా తమకు క్లిష్టతరంగా పరిణమించే విభాగాలపై, జనరల్‌ స్టడీస్‌లోని అన్ని విభాగాలలోని తాజా అంశాలపై దృష్టి పెట్టారు. ఇక కామన్‌ డిగ్రీతో దరఖాస్తు చేసేవారిలో తాజా అభ్యర్థులకు సమయమే సవాలు. కనీసం ఆర్నెల్లు చదవాల్సిన జనరల్‌ స్టడీస్‌ నెలరోజుల్లో పూర్తి చేయాల్సి రావడం కొండను ఢీకొనడమే. అయితే, క్లిష్ట విభాగాల నుంచి సులభ విభాగాలవైపు ప్రిపరేషన్‌ సాగితే ప్రయత్నం ఫలించవచ్చు.

సాంకేతిక అభ్యర్థులకు సదవకాశం



గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు సాధారణ డిగ్రీ చేసిన అభ్యర్థులకు వరప్రసాదమైతే, సాంకేతిక డిగ్రీ చేసిన గ్రాడ్యుయేట్లకు డబుల్‌ బొనాంజా. వీరు ఒక పక్క కేటగిరీ-1లోని పోస్టులకు పోటీ పడొచ్చు. మరో పక్క తమ విద్యార్హతలకు తగిన టెక్నికల్‌ పోస్టులకూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రెండింటికీ చేసుకున్నా దేన్ని లక్ష్యం చేసుకోవాలనేది సమస్య.
టెక్నికల్‌ విద్యార్హతలున్న అభ్యర్థుల్లో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్న డిజిటల్‌ అసిస్టెంట్‌కు ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్స్‌, ఐటీ బ్రాంచ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా, బీకాం, బీఎస్సీ కంప్యూటర్స్‌ చేసినవారు అర్హులు. డిగ్రీ అర్హతతో కేటగిరీ-1లోని సాధారణ పాలనా పోస్టులకు సైతం తమకు అర్హత ఉంది కాబట్టి ఎటువైపు వెళ్లాలన్నది వీరి సంశయం. ఏ దిశగా వెళితే, విజయం సాధిస్తామన్నది వీరిని వేధిస్తోంది.
డిజిటల్‌ అసిస్టెంట్‌ సిలబస్‌ పార్ట్‌-బిని పరిశీలిస్తే కంటెంట్స్‌ బీటెక్‌ ఈసీఈ  బ్రాంచి చేసినవారికి సులభంగా కనిపిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ కంటెంట్‌లో కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ అంశాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈసీఈ సబ్జెక్టులో బలంగా ఉన్నవారు మంచి స్కోర్‌ సాధించే అవకాశం ఉంది.  దీని తర్వాత బి.టెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అభ్యర్థులకు అనుకూలంగా ఉంది. ఈ రెండు బ్రాంచిల వారితో బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్‌ పోటీపడాల్సి ఉంటుంది కాబట్టి వాళ్లు అప్రమత్తంగా ఉండాలి.
డిజిటల్‌ అసిస్టెంట్‌ 150 మార్కుల పరీక్షలో 50 మార్కులు జనరల్‌ స్టడీస్‌ మినహాయిస్తే 100 మార్కులకు సబ్జెక్టు పేపర్‌  ఉంది. బీటెక్‌ అభ్యర్థులు తాము బలంగా ఉన్నదాన్ని వదిలి సాధారణ డిగ్రీతో పంచాయతీ గ్రేడు-5 తదితర పోస్టుల వారితో తలపడటం నష్టాన్ని కలిగించవచ్చు. దాని కంటే డిజిటల్‌ అసిస్టెంట్‌ పైనే పూర్తి దృష్టి పెట్టడం శ్రేయస్కరం కావచ్చు.
ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఈ పోస్టులకు సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసినవారు అర్హులు. తమ కోర్‌ సబ్జెక్టుల్లో బలంగా ఉన్నవారు కేటగిరి-1 సాధారణ పాలనా పోస్టుల వైపు వెళ్లడం అనవసరం. ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు పోటీపడటమే మంచిది. గతంలో గ్రూప్స్‌ పరీక్షలు రాసినవారు సాధారణ పోస్టులకు తీవ్ర పోటీ ఇస్తారు.
టెక్నికల్‌ పోస్టుల విషయంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా అభ్యర్థులకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా, దీని తర్వాత ఇంజినీరింగ్‌ చేసిన అభ్యర్థులు సొంత సబ్జెక్టులపై పట్టు ఉంటుంది. అదనంగా ఉన్న 50 మార్కుల జనరల్‌ స్టడీస్‌లో కాస్త మెరుగైన ప్రతిభ చూపితే పోటీలో ముందుండే అవకాశం ఉంది.
జీఎస్‌ - వర్తమానాంశాలపై  ప్రధాన దృష్టి

సాంకేతిక, ప్రత్యేక పోస్టులకు సంబంధించిన సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించగా 50 మార్కులు జనరల్‌ స్టడీస్‌ నుంచి ఉంటాయి. మొత్తం 150 మార్కులతో 80 నుంచి 90 మార్కుల మధ్య స్కోర్‌ చేసిన వారికి విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి. సాంకేతిక పోస్టుకు సంబంధించిన విభాగంలో సీరియస్‌ అభ్యర్థులందరూ దాదాపుగా సమాన ప్రతిభ చూపే అవకాశం ఉంది. ఈ తరహా అభ్యర్థులందరికీ జనరల్‌ స్టడీస్‌ కొత్త సబ్జెక్టు కాబట్టి ఈ విభాగంలో వచ్చే స్కోరే కీలకం అవుతుంది. జీఎస్‌లో పది అంశాలున్నాయి. అంటే ఈ విభాగంలోని 50 ప్రశ్నలు 10 అంశాల నుంచి ఇస్తారు. ఒక్కో అంశం నుంచి సగటున అయిదు ప్రశ్నలు రావచ్చు. ఈ అంశాలను రెండు కేటగిరీలుగా (సాంప్రదాయిక, వర్తమాన సంబంధిత) వర్గీకరించవచ్చు. మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ ఇంగ్లిష్‌, జాగ్రఫీ, హిస్టరీ నాలుగు సాంప్రదాయిక సబ్జెక్టులున్నాయి. మిగతావన్నీ వర్తమాన అంశాలతో ముడిపడినవే. పాలిటీ- కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సామాజిక న్యాయం, హక్కులు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలు. జనరల్‌ స్టడీస్‌ సిలబస్‌ విస్తృతం- స్వల్ప సమయంలో సన్నద్ధత కష్టం అని భయపడకుండా వర్తమాన అంశాలపై దృష్టిపెడితే అయిదారు విభాగాలు కవర్‌ అవుతాయి. ఈ ఏడాది జనవరి నుంచి కరెంట్‌ అఫైర్స్‌ను ఈ విభాగాలకు అనుసంధానం చేసుకుంటూ చదవగలిగితే జనరల్‌ స్టడీస్‌లో సగభాగం పూర్తయినట్టే. మిగతా సాంప్రదాయిక సబ్జెక్టులను సమయ పరిమితి రీత్యా కొంతవరకు పూర్తి చేయగలిగినా జనరల్‌ స్టడీస్‌లో ఈ స్వల్ప వ్యవధిలో మెరుగైన స్కోర్‌ను సాధించవచ్చు.

Click Here For

AP Grama Sachivalayam Study Material , Model Question Papers, Grand Test Papers,  How to Over Come Negative marking in Exams and Many More Details...